BG

Friday, November 4, 2022

అమెరికా తెలుగు రచయితల సమావేశం - 2022


మొన్న వీకెండ్ ( అక్టోబర్ 29 - 30, 2022) డాలస్ లో ఏర్పాటు చేసిన అమెరికా తెలుగు రచయితల సదస్సుకు వెళ్ళాను. నేను ఇంతకు ముందు కలిసిన వాళ్ళు కొందరు, కేవలం ఫేస్బుక్ పరిచయం మాత్రమే ఉన్న వాళ్ళు కొందరు,  కేవలం పేర్లు మాత్రమే తెలిసిన వాళ్ళు కొందరు, పేర్లు కూడా తెలియని వాళ్ళు కొందరు ... రెండు రోజుల సమయం చర్చలతో, నవ్వులతో, విందులతో నిమిషాల్లా గడిచిపోయింది.

సదస్సుని కథనం, కథ, కవిత్వం, పత్రికలు – పుస్తక ప్రచురణలు, నవల, విమర్శ, అనువాదాలు అన్న అంశాలుగా విభజించి,  ఒక్కో అంశంపై చర్చించడానికి  కొంతమంది చొప్పున  ఎన్నుకున్నారు.  చర్చల్లో పాల్గొన్నవారూ, ప్రేక్షకుల నుంచి ప్రశ్నలూ అడిగినవారు చర్చలు ఆసక్తికరంగా ఉండేలా చేసారు.



 
సమన్వయకర్తలందరూ, వారి సెషన్చలో చర్చిస్తున్న విషయం మీద మంచి అవగాహనతో చేసిన వాఖ్యలూ, ఆలోచనతో వేసిన ప్రశ్నలూ, సమయపరిపాలన అమలుపరిచిన విధమూ నాకు ఆశ్చర్యమూ, సంతోషమూ కలిగించాయి.

సదస్సుని నిర్వహించి,  అతిధులకు ఆతిధ్యం ఇచ్చిన డాలస్ స్నేహితుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వెళ్లేముందు అందరూ కొత్తవారే, పైగా కొత్తవారి ఇంట్లో విందులూ అని  కొంచెం తడబాటుగా అనిపించినా, మొదటిరోజే అందరూ ఎప్పటినుంచో తెలిసినట్టు అయిపోయారు. నేను వచ్చేస్తాను అని చెప్పినా ఒప్పుకోకుండా, 'మీరు మావూరు వస్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్లడం మాకు సంతోషం. మమ్మల్ని ఆ మాత్రం చెయ్యనివ్వండి' అని ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి  తీసుకెళ్ళిన సురేష్ కాజ (తెలుగు యాంకీ) గారిని కలవడంతోనే నా సందేహాలన్నీ ఎగిరిపోయాయి. సదస్సు విషయం ప్రకటించగానే నన్ను ఇంటికి ఆహ్వానించిన విజయ కర్రా గారికి, విసుక్కోకుండా ఓపికగా తిప్పిన సురేష్ & వారి శ్రీమతి శిరీష గారికీ,  ఆప్యాయంగా అందరికీ విందు చేసిన  అనంత్ & సురేఖ గారికీ ,  చంద్రహాస్ & నీలిమ గారికీ ధన్యవాదాలు. విందు మాత్రమే కాకుండా ఆ రెండు రోజులూ అందరూ మమ్మల్ని ఎప్పటి నుంచో తెలిసినట్టుగా స్నేహంగా చూసుకున్నారు. I really felt at home.

సదస్సు ముఖ్య నిర్వాహకులు చంద్ర కన్నెగంటి, గొర్తి బ్రహ్మానందం, అఫ్సర్, కల్పన రెంటాల గార్లకు, నాకు ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు  కృతజ్ఞతలు.  మంచి అనుభవాలతో,  జ్ఞాపకాలతో, కొత్త స్నేహాలతో వెనక్కి వచ్చాను. ఈ సదస్సు ఏర్పాట్లలో భాగం పంచుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.